
ఇండస్ట్రీలో ఎంత కష్టం వచ్చినా, ఎంత అవమానాలు వచ్చినా, ఎన్ని నిరాశలు ఎదురైనా… గట్టిగా పోరాడితే పోతుంది బానిస సంకెళ్లే తప్ప ఇంకేం కాదు. ఆ మాటకే నిలబడ్డ దర్శకులు రాజమౌళి, సుకుమార్, వినాయక్, పూరి వంటి వాళ్లు. ఫస్ట్ సినిమా తీయగానే, “మా టాలెంట్ ఇదయ్యా!” అని గట్టిగా చూపించారు.
కానీ ఇక్కడ ఓ పాయింట్ ఉంది… రాజమౌళిని మినహాయిస్తే మిగతా డైరెక్టర్లు ఎక్కువమంది రెండో సినిమా దగ్గరే కిందపడిపోయారు. ఎందుకంటే ఫస్ట్ హిట్ కొట్టడం ఈజీ, కానీ రెండో సినిమా మాత్రం అసలు తలనొప్పి. ఫస్ట్ మూవీ ఇచ్చిన క్రేజ్, హైప్, అంచనాలు… ఇవన్నీ సెకండ్ సినిమాపై కూర్చుంటాయి కాబట్టి, ఆ ప్రెజర్ ను హాండిల్ చేయడం చాలా కష్టం.
ఇప్పుడీ అదే టాపిక్ మీద ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ‘బలగం’తో అదిరిపోయే హిట్ కొట్టిన వేణు ఎల్దండి ఇప్పుడు తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ చేస్తున్నాడు. సినిమా గురించి చాలాకాలంగా మాటలు వస్తున్నా, హీరో ఎవరు? హీరోయిన్ ఎవరు? అన్నది మాత్రం రహస్యమే. కొన్ని పేర్లు వచ్చినా, అవన్నీ రూమర్స్ అన్నట్టుగా యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
కానీ తాజా సమాచారం ప్రకారం — ఈ సినిమాలో హీరోగా విజయ్ ఆంటోనిను పెట్టాలని వేణు, దిల్ రాజు ఇద్దరూ ఫిక్స్ అయినట్టు లీకులు వస్తున్నాయి. ఏం చెప్పాలి … నటనలో అయినా, గంభీరంగా పాత్రలను మోసే విషయంలో అయినా విజయ్ ఆంటోని టాప్ క్లాస్. అందుకే ఆయన ఈ స్టోరీకి బాగా సూట్ అవుతాడని ఇద్దరూ ఓకే అయ్యారట. కథ కూడా ఆయన్ను కలిసి వినిపించారట.
ఇటీవల భద్రకాళి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు, తెలుగులో ఎప్పటినుంచో మంచి మార్కెట్ కూడా ఉంది. ముఖ్యంగా ‘బిచ్చగాడు’తో ఏ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడో మనకి తెలుసు. అందుకే మరికొన్ని రోజుల్లో అధికారికంగా ఆయన పేరును అనౌన్స్ చేసే అవకాశాలు పక్కా. మొత్తం మీద ‘ఎల్లమ్మ’కి హీరో దొరికేసినట్టే.
అయితే… ఒక చిన్న డౌట్ మాత్రం ఉంటుంది. విజయ్ ఆంటోని చివరి వరకూ ఈ సినిమాలో ఉంటాడా? లేక మధ్యలో ఏదైనా మార్పు జరుగుతుందా? అది మాత్రం టైం చెబుతుంది. ఏమైనా… ఇప్పుడు అందరి కళ్ళూ వేణు ఎల్దండి మీదే. ‘బలగం’ తర్వాత రెండో పరీక్షను ఎలా దాటుతాడు? అని.


