బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. గత కొన్ని రోజులుగా లక్షలాది మంది ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తిన విజేత పేరు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చింది. ఈసారి బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నది ఎవరో సెలబ్రిటీ కాదు… ఓ కామనర్. అదే ఈ సీజన్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది.
సీజన్ 9 టైటిల్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించాడు. వేలాది దరఖాస్తులను దాటి, కఠినమైన అగ్నిపరీక్షల్లో నిలబడి హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్… మొదటి నుంచే ఫస్ట్ కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి, చివరకు నెంబర్ వన్‌గా నిలవడం నిజంగా అరుదైన ఘనత. అయితే, కళ్యాణ్ ప్రయాణం అంత ఈజీ కాదు. మొదటి మూడు వారాలు అతని ఆటతీరుపై నెగటివిటీ కనిపించింది. సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. కానీ అదే సమయంలో తనలోని అసలైన గేమ్‌ను బయటకు తీసుకొచ్చాడు. గేమ్ స్ట్రాటజీ, మాటల తీరు, నిజాయితీగా ఆడే విధానం క్రమంగా ఆడియన్స్ హృదయాలను తాకాయి.
రోజురోజుకు అతని ఫ్యాన్ బేస్ పెరిగింది. ప్రతి టాస్క్‌లోనూ తన సత్తా చాటుతూ, జెన్యూన్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. విన్నర్ రేస్‌లో దూసుకెళ్తున్న తనుజకు గట్టి పోటీ ఇచ్చి, చివరకు కోట్లాది మంది ప్రేక్షకుల మద్దతుతో ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇక కళ్యాణ్ పడాల ఎంత మొత్తం ఇంటికి తీసుకెళ్లాడన్నదానిపై కూడా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ విన్నర్‌కు మొత్తం రూ.50 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. అయితే ఇందులో డిమోన్ ద్వారా కళ్యాణ్ ఇప్పటికే రూ.15 లక్షలు తీసుకున్నాడు. దాంతో మిగిలిన ప్రైజ్ మనీ రూ.35 లక్షలు.
అదే సమయంలో, వారానికి సుమారు రూ.2 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. మొత్తం 15 వారాల పాటు ఉండటంతో… దాదాపు రూ.30 లక్షల రెమ్యూనరేషన్ వచ్చింది. అంటే ప్రైజ్ మనీ రూ.35 లక్షలు + రెమ్యూనరేషన్ రూ.30 లక్షలు కలిపి… మొత్తం రూ.65 లక్షలు కళ్యాణ్ పడాల సొంతమయ్యాయి. వీటితో పాటు ఒక మారుతి సుజుకి కార్ కూడా గిఫ్ట్‌గా అందించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణ్ పడాల జీవితం కూడా చాలామందికి ప్రేరణగా మారింది. కష్టపడి చదివి ఆర్మీలో ఉద్యోగం సాధించి, మూడేళ్ల పాటు దేశానికి సేవలందించాడు. ఆ తర్వాత చిన్ననాటి కల అయిన నటనపై ఆసక్తితో ఆర్మీకి గుడ్‌బై చెప్పి బిగ్ బాస్ ప్రయాణం మొదలుపెట్టాడు.
వేలాదిమందిని దాటి, అగ్నిపరీక్షలు ఎదుర్కొని, బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టి… చివరకు ట్రోఫీతో బయటకు రావడం అంటే మాటలు కాదు. ఇప్పుడు కళ్యాణ్ పడాల సక్సెస్‌ను ప్రేక్షకులు సంబరంగా సెలబ్రేట్ చేస్తున్నారు.



