తెలుగు బుల్లితెరపై కోట్లాది మంది ప్రేక్షకులను కట్టిపడేసిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో ట్విస్టులు, అనూహ్యమైన టాస్కులు, భావోద్వేగ క్షణాలతో సాగిన ఈ సీజన్… గ్రాండ్ ఫినాలే దశకు రావడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.
డిసెంబర్ 21వ తేదీ, ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరగనున్న గ్రాండ్ ఫినాలే కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు పోటీలో ఉండగా… రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు ప్రతిష్టాత్మక ట్రోఫీ ఎవరి సొంతం అవుతుంది? అన్నదానిపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.
గ్రాండ్ ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు?
అన్న అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
గత సీజన్లను పరిశీలిస్తే… బిగ్ బాస్ ఫినాలేలకు స్టార్ హీరోల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి సీజన్లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా, శివ బాలాజీకి ఆయనే ట్రోఫీ అందించారు. రెండో సీజన్లో నాని హోస్ట్‌గా ఉండగా, వెంకటేశ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై కౌశల్‌ను విజేతగా ప్రకటించారు.
మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతుండగా… మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు ఫినాలేకు హాజరై షోకు ప్రత్యేక గ్లామర్ తెచ్చారు. సీజన్ 8లో అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చి, విన్నర్ నిఖిల్‌కు ట్రోఫీ అందించారు.
ఈ క్రమంలోనే… బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం… చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా విడుదల కానుండటం. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ వేదికపై చిరు సందడి చేసే అవకాశం ఉందని టాక్. ఇది నిజమైతే… చిరంజీవి మూడోసారి బిగ్ బాస్ ఫినాలేకు ముఖ్య అతిథిగా రానున్నట్టే.
ఇక మరోవైపు… టైటిల్ రేస్ కూడా హోరాహోరీగా సాగుతోంది. సోషల్ మీడియా ట్రెండ్స్, ఫ్యాన్ పోల్స్ ప్రకారం కల్యాణ్, తనూజ, డీమన్ పవన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. తొలుత కల్యాణ్ – తనూజ మధ్యే పోటీ ఉంటుందని భావించినా… ఫైనల్ వీక్‌లో డీమన్ పవన్ అనూహ్యంగా బలమైన పోటీదారుగా మారాడు. అయినప్పటికీ, ఎక్కువ శాతం నెటిజన్లు, ఫ్యాన్ పోల్స్ మాత్రం కల్యాణ్ వైపే మొగ్గు చూపుతున్నాయి.


