విష్ణు ప్రియ జీవితంలో చీకటి రోజులు.. ఇంటర్వ్యూలో బయటపడ్డ నిజాలు

Share the post

ఇటీవలి కాలంలో టీవీ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణు ప్రియ పేరు తెలియని వారే ఉండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ షోతో వచ్చిన గుర్తింపు, తర్వాత బిగ్ బాస్‌లో పాల్గొనడం వల్ల మరింత విస్తరించింది. ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న ఫ్యాన్‌బేస్ కూడా ఆ సమయంలో బాగా పెరిగింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా ఓపెన్‌గా పంచుకున్నారు. ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ, తన మనసుకు నచ్చిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకునే స్థాయిలో కూడా ఆలోచించానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, తనపై మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడంతో ఎదుర్కొన్న అవమానాలు తనను లోపల నుంచి ఎంతగా కుంగదీసాయో వివరించారు. ఆ బాధ తట్టుకోలేక ఓ దశలో ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చినట్టు చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఇంటర్వ్యూలో మరో కీలక అంశంగా జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. బయట ఆయనపై ఎన్నో విమర్శలు వినిపిస్తున్నా, తన జీవితంలో ఆయన చేసిన సహాయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనని విష్ణు ప్రియ భావోద్వేగంగా చెప్పారు. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో బిల్లులు లక్షల్లోకి చేరాయని, ఆ సమయంలో ఎవరికీ అడగకూడదనుకున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వేణు స్వామికి ఫోన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఫోన్ చేసిన వెంటనే ఎలాంటి సందేహం లేకుండా డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చారని, ఆయన సహాయం వల్లే డాక్టర్లు మూడు రోజులు మాత్రమే జీవిస్తారని చెప్పిన తన తల్లి, మరో ఏడాది పాటు జీవించిందని ఆమె వెల్లడించారు. వేణు స్వామి గురించి చాలామంది ఒక్కోలా మాట్లాడతారని, కానీ నిజంగా ఆయనను దగ్గరగా తెలిసిన వాళ్లు మాత్రం ఎప్పటికీ తప్పుగా మాట్లాడరని స్పష్టం చేశారు. అవసరం వచ్చినప్పుడు ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి ఆయన అని ప్రశంసించారు.
ఈ ఇంటర్వ్యూతో విష్ణు ప్రియ వ్యక్తిగత జీవితంలోని బాధలు, పోరాటాలు మాత్రమే కాదు, ఆమె కృతజ్ఞతాభావం కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.





Share the post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *